సమాధి పుష్పం

రచన: ఆదిమూలం వెంకట కృష్ణ మూర్తి

“నా కొడుకున్నది పట్నం –

తిప్పుతాడు బతుకు బాటల రాట్నం”

గడ్డి గుడిసెలో గుడ్డి దీపం

కనుగుడ్ల పై కొడుకు రూపం.

కొడుకు నుంచి జాబు కోసం

కంటికి చేయిచేరుస్తూ చుస్తున్నది

చేతిలో సాంచెల్ జారుస్తూ కాలం కూర్చున్నది

దూర తీరాలలో కాగడాల వెలుగు

న్యాయాన్యాయాలకు అలుగు.

పోస్ట్ … పోస్ట్ .. పోస్ట్ …

క్రింద పడ్డ జాబు ముక్క చేతికందింది.

“అమ్మా,

నా భవితే దేశానికి దివిటి

నేనే ఈ దేశపు మావటి

అనే గేయం మాది

అదే ధ్యేయం మాది

విషాద ధునిని నేను

– విచార గనిని నేను

నా దేశపు హేష

– మరెవరిదో ఘోష

కాకీ చొక్కాకి తూటాల మాల

– నా చుట్టూ పిశాచాల గోల

నన్ను కన్న తల్లి కోసం

నే కన్న పిల్లల కోసం

నాలో సగమైన వారి కోసం

మేఘ సందేశాలు పంపిస్తూ

మబ్బుల వెంట పరిగెడతాం

నీటి బిందువుల్ని

ముత్యాల్లా ఏరుకుంటాం

మతాబుల్లా వెలిగించుకుంటాం

వాట్టిల్లో.. నన్ను కన్నోళ్ళని

నేను కన్నోళ్ళని చూసుకోడానికి

… తపిస్తాం… జపిస్తాం…

‘నీ రక్తాన్ని పోల్చుకో

ఏ రంగు లో ఉందొ తేల్చుకో

నీ స్టెన్ గన్ పేలినప్పుడు

తోక చుక్క తెగిన చప్పుడు

పడవ చీల ఊడిన చప్పుడు

‘నీ అమ్మలాంటి అమ్మ లు ఏడ్చినప్పుడు

కణ కణలాడే కళ్ళలో నీ రూపం

సలా సలా కాగుతుంటే –

అదిగో ఎగిరిన నీ కీర్తి బావుటా

ఎండి, చివికి రాలుతోంది బాహాటంగా

విచ్చిన కత్తి నీ చేతిలో

చచ్చిన శవం ఆ గోతిలో

– ఎప్పుడైనా, దేన్నైనా క్షమాభిక్ష కోరావా

– ఇంతకీ ఏది క్షమించింది ?’

అని ఏదో శక్తి నన్ను నిలదీస్తుంటే,

నా కాకీ చొక్కా నన్నే కాటేసినట్లుంది

నా తూటాలు నన్నే తూట్లు చేసినట్లుంది

‘ఓ కవిత్వమా ! ఓ కవిత్వమా !!

ఎందుకే మనసు పొరల మాటున

ఆర్ధ్రతను ఛిద్రం చేస్తావు

ఎందుకే నీళ్ళూరని నా గుండెల్లోలోతుల్లో

గునపాలు దించుతావు’

అంటూ కవిత్వాలల్లుతాను.

గల్లీ గల్లీ తిరుగుతా

జాబిల్లినీ అడుగుతా

పాల వెల్లినీ అడుగుతా

నేను పరచిన రక్త చందన తివాచీని

కాంతి వంతం చేయండని

శాంతి మతం గావించండని

అమ్మా,

నా గుండెల్లో తూటా దిగితే,

ఆ తూటాకే సలాం చెయ్

ఆ తూటాను నా తీపిగుర్తుగా

సమాధి పై ఉంచేయి – వో పుష్పం లా

సెలవ్

ఇట్లు

ఎండా, వానా, చలి లో

తూటా కి గుండె అడ్డుపెట్టి

స్వర్గ ద్వారం ముందు నిలబడ్డ

నీ పుత్రుడు ”

టెలిగ్రాం పంపండి

కేరాఫ్ సో అండ్ సో…..

మీ వాడు డెడ్…

ఖనన కవాటాలు మూసుకున్నాయి

దహన భావాలు ముసురుకున్నాయి

ఆఖరి ఉత్తరం అదిమిపట్టి,

ఆకాశం వైపు చూస్తోంది –

కోట్ల నక్షత్రాలలో తన కొడుకు కోసం.

**********************

1 thought on “సమాధి పుష్పం”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top