రచన: ఆదిమూలం వెంకట కృష్ణ మూర్తి
మనసూ … ప్రాణం …
నీ వైపు కొట్టుకొచ్చాక
మిగిలి పోయిన యీ మట్టిలో …
ఏ విత్తనం నాటమంటావు ?
సముద్రం గుండె లోతుల్లోకి
జారిపోయిన
ఓ కన్నీటి బొట్టు జాడ కోసం,
ఏ వలను విసరమంటావు.
ఒక్క చినుకు కోసం
ఆకాశాన్నే చూస్తూ,
నోరు తెరచిన బీడులా
ఎలా ఉండి పొమ్మంటావు.
రాత్రి రాలిన మంచు బిందువు
ఆవిరయ్యే వరకు
ఎదురు చూసే కళ్ళకు
ఏ సమాధానం చెప్పమంటావు.
కళ్ళు మూసుకున్న ప్రతి సారీ
ప్రత్యక్షమయ్యే నీ రూపాన్ని
ఎన్ని సార్లు ఆహ్వానించ మంటావు ?
ఉన్న ఒకే ఆకాశం లో
ఎప్పుడూ కలవని
సూర్యుడిని, చంద్రుడిని
మనకు రుజువులని
ఎలా అనుకోమంటావు.
నాకు తెలియకుండానే
గడిచి పోయిన కాలంలో
ప్రతి పుటనీ నీకంకితమిచ్చాక
చివరి నీ సంతకం కోసం
ఎంతకాలమయినా…..
నీ చుట్టూ ఎన్ని సౌధాలున్నా
నీ చుట్టూ ఎన్ని సమాధులున్నా
నీ ముంగిట మిగిలిపోతా
ఓ దీప కణికలా……..
కాంతులీనుతూ ….. నీ రాకకై